"ఆశయాల సమాహారం జీవితం, ఆచరణల మేలుకొలుపు మన ప్రస్థానం".ఆలోచన విజయానికి తొలిమెట్టు అని నేను నమ్ముతాను. ఆ వైపుగా నా తొలి అడుగు,ఆలోచనల సమాహారం నా అంతర్మధనం అనూస్ అంతర్మధనం. ఇంజినీరుంగులొ పి.హెచ్ డి డిగ్రీ కోసం శ్రమిస్తూ, వినిపిస్తున్న నా కవితావాణి వలన కలిగే అనిర్వచనీయమైన ఆనందం ఉభయతారకం. ఈ నా బ్లాగు మనస్సు సంకల్పిత స్పందన, నా మేధస్సును మధించిన ప్రతిస్పందన. రెండింట మధ్య సమన్వయం కల్గిస్తూ సాహిత్య లోకానికి నా గుండె చప్పుడు .... తెలివి తప్పెట్లు...
చిన్నపట్నుంచి ఇంగ్లీషు మీడియములొ చదువుకున్న తెలుగు భాష మీద అభిమానంతో అదృష్టవశాత్తు "టింగ్లీషు" కు అలవాటుపడక అమ్మ ప్రేమ మాతృభాష మమత వెంట రాగా ఈ బ్లాగును ఆవిష్కరిస్తున్నాను. ఇంక నా రచనా శైలి గురించి: కవిత్వములో శ్రీశ్రీ గారు నాకు ఆరాధ్య దైవం. ఆయన భావావేశం అయినా, పదాల కూర్పు అయినా, "న భూతో న భవిష్యత్త్". మహప్రస్తానం ఎన్ని సార్లు చదివినా నాకు మాత్రం అనంతమైన సాహిత్య ఘని.చదివిన ప్రతి సారి ఒక కొత్త అనుభూతిని కల్గిస్తుంది. శ్రీశ్రీ గారిలా రాసేయాలని తెగ తాపత్రయపడిపొయినా, ఆ మహనీయుని కలం వాడి వేడి లొ ఒక శాతం సాధించిన ఈ జన్మ ధన్యం.
"ఏదో అసంతృప్తి వుంటేనే కళాకారులు రచయితలు అవుతారట" ఏక్కడో చదివిన గుర్తు. కాని ఎందుకో నేను నమ్మలేకపొతున్నా. కానీ ఒకటి మాత్రం నిజం శ్రీ శ్రీ గారు అన్నట్లు కష్ఠజీవికి కాపు కాసేవాడే కవి. సమాజ అసమానతలకు స్పందించి , అసంతృప్తిని హృద్యముగా వివరించి జనాలని ఆలోచింపచేసి నవ సమాజపు నిర్మాణానికి సంధాన కర్తగా వ్యవహరించి కర్తవ్యాన్ని నిర్వహిస్తుంది కవి హృదయం. అందుకని నా రచనలు కాశ్మీరీ అందాలు పారే సెలయేరు ను కాక సాంఘిక దురాచారాలను, దౌర్జన్యాలను స్పృశిస్తాయి. నా కవితా ఝరి నా ఆరటాల మానసపుత్రికై కలము నుంచి జాలువారి తెల్లటి కాగితంపై ఉచ్ఛమైన ఆలోచనల పరంపర "అను"సంధానం అవుతుంది.
"నినన్నది లేదు మనకు ఏ రోజు, రేపన్నది రాదు ఎప్పూడు నీ తోడు" అని మనసా వాచా కర్మణా నమ్మి ఆశయసాధన కై ప్రయత్నిస్తూ "మానవత్వం నా వాదం, సమానత్వం నా నాదం". సేవ చేయటం నా కిష్టం, పోరాడడం నా కిష్టం, వివేకముతో అలోచించడం నా కిష్టం, నవభారత సౌధాన్ని నిర్మించడం నా కిష్టం, దురాచరాలని ఎదిరించడం నా కిష్టం, జ్ఞానాన్ని సముపార్జించుకోవటం నా కిష్టం. ముఖ్యముగా భారతదేశములో 60 సంవత్సరాల స్వాతంత్ర్యము తరువాత కూడా నానాటికి పెరుగుతున్న రాజకీయ, సాంఘిక, ఆర్ధిక అసమానతలను ఎదిరించి పోరాడి, సరి చేసి మరియొకసరి మేరా భారత్ మహాన్ అంటూ ఈ వైపు జవానుని ఆ వైపు కిసానుని నిలబెట్టి మధ్యలో బంగారు కాంతి తో ధగధగ మానమై వెలిగే భారతజాతి కీర్తి ఏవరెస్టు పతాకాన ఎగురువేసే అవకాశం కోసం ఎదురుచూస్తూ, ఆ సుందర సుమధుర స్వప్నాన్ని నా నయనాలలొ సజీవముగా నిలుపుకొని
సాంఘిక దురాచారాలు పారద్రోలే సంఘసంస్కర్తను కాను
అడవిలొ పోరాడే అన్నను కాను
ఒక సామాన్య భారతీయునిగా, సాధారణ మహిళగా
మానవత్వ ఉసురుతో పూరిస్తున్న విప్లవ నగారా, ఆలోచనల నయాగారా, అన్యాయాల ప్రహారా!!!
ఉపసంహారం: ఇంతకముందే నా చిన్ని బుర్రలో ఎన్నో కవితలు పుట్టినా, ఏనాడు కలముతో కాగితమును ఖరాబు చెయ్యలేదు, స్కూలులో పోటీలకి తప్ప (బద్దకం ఏమో మరి!!). కానీ క్రిందటి ఏడాది నా అభిమాన క్రీడాకారుడు-- అనిల్ కుంబ్లే క్రికెటుకు వీడ్కొలు చెప్పినప్పుడు అనంద బాధ మేళవింపులతో స్పందించినప్పుడు మొదటిసారి ఒక డైరీ లో రాయటం మొదలుపెట్టాను (ఎప్పుడైనా అనిల్ ని కలిస్తే తర్జుమా చేసైనా నా కవితని వినిపించెయ్యాలని తాపత్రయం). అలా అలవాటు చేసుకుని ఈ కవితా పరంపరను సాగిస్తూ "సిల్వర్" పుట్టినరోజు సందర్భముగా ఇన్నేళ్ళ జీవితానికి బ్లాగ్సార్ధకత సాధించాలని కృషి చేస్తున్నాను.
నేను రాసే కవితలను ఇంటర్నేషనల్ కాలులో ఓపికగా వినే అమ్మకు, అలాగే తన పరిశోధనను నా కోసం బలవంతముగా ప్రక్కన పెట్టి నా శ్వోత్కర్షను వినే నా సహచరణి చైతన్య కు కృతఙ్నతలు తెలుపుతూ, పాఠకులకు ఒక చిన్న చిలిపి వినతి. నా రచనలు అర్ధం కాకుండా వుంటే నేనేమి రాసినా అద్భుతం అనే అమ్మ, బాగోలేదని విమర్శించని చైతన్యలదే తప్పు కాని నాది ఏ మాత్రం కాదు... గ్రహించగలరు. మీరు మాత్రం మీ విమర్శలను, అభిప్రాయలను తెలియజేయలని వినయముతో అర్ధిస్తూ .... అనూ